Saturday 4th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడులో నో టికెట్.. పోటీపై అన్నామలై వివరణ!

తమిళనాడులో నో టికెట్.. పోటీపై అన్నామలై వివరణ!

Annamalai

Annamalai statement on TN Elections | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి పార్టీ టికెట్ నిరాకరించిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన 27 మంది అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పొత్తులో భాగంగా అన్నా డీఎంకే (AIADMK) ఒత్తిడి మేరకే అన్నామలైని బీజేపీ పక్కన పెట్టిందనే ప్రచారం జోరుగా సాగింది.

ఈ నేపథ్యంలో శనివారం చెన్నై ఎయిర్‌పోర్టులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అన్నామలై, ఈ ప్రచారానికి తెరదించుతూ కీలక వివరణ ఇచ్చారు.

తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముందే పార్టీ కోర్ కమిటీకి రాతపూర్వకంగా తెలియజేశానని అన్నామలై స్పష్టం చేశారు.

“నాకు టికెట్ రాకపోవడం కాదు, నేనే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం” అని ఆయన వివరించారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు పార్టీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అన్నా డీఎంకే ఒత్తిడి వల్ల టికెట్ దక్కలేదన్న వార్తల్లో నిజం లేదని ఆయన పరోక్షంగా కొట్టిపారేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నట్లు తెలిపిన అన్నామలై, ఆ పర్యటనలు ముగిసిన తర్వాత తమిళనాడులో ఎన్డీయే (NDA) అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు.

అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా కూటమి గెలుపు కోసం తన వంతు పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అన్నామలై వివరణతో టికెట్ కేటాయింపుపై సాగుతున్న ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.

You may also like
smart machine in chennai merina beach
చెన్నై మెరీనా బీచ్ లో స్మార్ట్ మెషిన్.. ప్లాస్టిక్ ఇస్తే ఏం ఇస్తుందో తెలుసా!
modi
జన విశ్వాస్ బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ హర్షం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions