Andhra vs Karnataka battle gets spicier | ఏపీలోని విశాఖపట్నంలో దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-గూగుల్ సంస్థ మధ్య తాజగా ఒప్పందం జరిగింది.
1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ మరియు వైజాగ్ ను ఏఐ సిటీగా మార్చేందుకు 15 బిలియన్ దాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే మరియు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కర్ణాటక నుంచి భారీ పెట్టుబడి అవకాశాన్ని ఏపీకి తరలిపోయేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని బీజేపీ, జేడీఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ తరుణంలో స్పందించిన ప్రియాంక్ ఖర్గే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఆర్థిక విపత్తుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు, భూమి మరియు నీటి ఛార్జీలపై 25% సబ్సిడీ, ఉచిత విద్యుత్, మరియు 100% రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందన్నారు. “కర్ణాటక ఇలా చేసి ఉంటే, రాష్ట్రాన్ని దివాళా తీయించామని మమ్మల్ని నిందించేవారు” అని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ‘ ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా కొన్ని అలాగే ఉన్నాయనిపిస్తోంది. పొరుగువారు కొందరు ఇప్పటికే ఆ వేడిని అనుభవిస్తున్నారు’ అని పరోక్షంగా ఎద్దేవా చేశారు.









