Amaravati official capital of AP Gazette | ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పార్లమెంటు ఆమోదం పొందిన ‘అమరావతి రాజధాని సవరణ బిల్లు’పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడంతో, కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది.
గెజిట్ నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో మార్పులు చేశారు. గతంలో ఉన్న “కొత్త రాజధాని ఉంటుంది” (a new capital) అనే పదబంధం స్థానంలో, ఇకపై “అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది” (Amaravati shall be the new capital) అని స్పష్టంగా చేర్చారు.
ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు (Retrospective effect) గెజిట్‌లో పేర్కొన్నారు. అంటే గతేడాది నుంచే అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా పరిగణించబడుతుంది.
‘అమరావతి’ అంటే ఏమిటో కూడా చట్టంలో వివరణ ఇచ్చారు. 2014 నాటి సీఆర్డీయే (CRDA) చట్టం ప్రకారం నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలనే ‘అమరావతి’గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
ప్రక్రియ సాగిందిలా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాజధాని సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. లోక్‌సభ, రాజ్యసభలలో ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ ప్రచురించింది.
ఈ పరిణామంతో రాజధాని విషయంలో భవిష్యత్తులో ఎటువంటి చట్టపరమైన చిక్కులు ఉండవని, అమరావతి నిర్మాణ పనులకు కేంద్రం నుండి మరిన్ని నిధులు, సహకారం అందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.






