Akshay Kumar Reveals Daughter’s Horror In Online Game | సైబర్ నేరగాళ్ల మూలంగా తన కుమార్తెకు ఎదురైన భయానక సంఘటనను వివరించారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఇదే సమయంలో పాఠశాల దశలోనే విద్యార్థులను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కోరారు.
శుక్రవారం ముంబయిలోని మహారాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ‘ సైబర్ అవేర్‌నెస్ మంత్-2025’ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న అక్షయ్ కుమార్ మాట్లాడుతూ తన కుమార్తెకు ఎదురైన ఘటన గురించి మాట్లాడారు.
‘నా 13 ఏళ్ల కుమార్తె ఒకరోజు మల్టీప్లేయర్ వీడియో గేమ్ ఆడుతుంది. ఒక అపరిచితుడు ఆమెకు మెసేజ్ చేశాడు. తొలుత స్నేహపూరితంగా మెసెజీలు చేశాడు. అనంతరం నువ్వు అమ్మాయా? అబ్బాయా? అని అడిగాడు. దింతో నా కుమార్తె నేను అమ్మాయి అని సమాధానం చెప్పింది. వెంటనే న్యూడ్ ఫోటోస్ పంపగలవా అని అడిగాడు. ఇది చూసిన అమ్మాయి చాలా భయపడింది. వెంటనే గేమ్ ను ఆపేసి ఈ విషయాన్ని తల్లితో చెప్పింది’ అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ రకమైన సంఘటనలు పిల్లలను ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యార్థులకు ప్రతి వారం ‘సైబర్ పీరియడ్’ నిర్వహించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయాలని కోరారు. పిల్లలు చదువుల్లోనే దీని గురించి నేర్చుకుంటే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఈ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించి, సైబర్ నివారణ చర్యలను బలోపేతం చేస్తామని, పాఠశాలల్లో సైబర్ విద్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.









