A Septic Tank Truck Caught Dumping Waste Directly in Gandipet | హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయాలని ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పందించారు. ప్రజలేవరు ఆందోళన చెందవద్దన్నారు. మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్‌ను జలమండలి అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
విచారణ సమయంలో డ్రైవర్ రామవత్ శివ నాయక్ మరియు హిమాయత్ నగర్ నివాసి నిరంజన్ ఆదేశాల మేరకు ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారని వెల్లడించారు. అలాగే ట్యాంకర్‌పై ఎటువంటి అనుమతి లేకుండా HMWSSB లోగోను వినియోగించారని ప్రజలను మరియు అధికారులను నమ్మించి, తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మోసపూరితంగా లోగోను వాడినట్లు తేలిందన్నారు. ఉస్మాన్ సాగర్ ఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.









