Gunfire in Hyderabad: Man Injured During Robbery at Koti | హైదరాబాద్ నడిబొడ్డున కోఠి ప్రాంతంలో శనివారం ఉదయం కాల్పుల కలకలం రేగింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షల నగదు లాక్కొని అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనను హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇందులో భాగంగా కేరళకు చెందిన రిన్షాద్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే దుండగులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక క్రైం బృందాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. ఫిర్యాదు ఆధారంగా చుస్తే రిన్షాద్ పిల్లల రెడీమేడ్ దుస్తుల వ్యాపారి. హోల్ సేల్ స్టాక్ కొనుగోలు కోసం జనవరి 7న ఆయన రూ.6 లక్షల నగదుతో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కొనుగోలు కుదరలేదు. ఈ క్రమంలో బంధువు మిష్బాన్ సలహా మేరకు డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా స్నేహితుడు అమీర్ కు చెందిన వాహనం తీసుకుని కోఠి స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ఏటీయం వద్దకు చేరుకున్నారు.
అక్కడ నగదు జమ చేస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుండి వచ్చి, తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా, అందులో బాధితుడి కుడి కాలికి తగిలి గాయమైంది. అనంతరం నిందితులు నగదు సంచితో పాటు వాహనం తాళంచెవులను బలవంతంగా లాక్కొని, బాధితుడి వాహనంలోనే అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు చాదర్‌ఘాట్ సిగ్నల్ మీదుగా నింబోలిఅడ్డా, కాచిగూడ వైపు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్కడ వాహనాన్ని వదిలివేసి, దుస్తులు మార్చుకుని కాచిగూడ చౌరస్తా వైపు కాలినడకన పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడం వంటివి చేస్తున్నారు.









