CM Chandrababu’s E-Cycle Rally at Kuppam | ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ-సైకిల్ ను నడిపిస్తూ సుమారు 3 కి.మీ ప్రయాణించారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ పంపిణీ చేశారు. ఇ-మోటరాడ్ అనే సంస్థ తయారు చేసిన ఈ ఈ-సైకిళ్లను 24 గంటల వ్యవధిలో 5,555 మంది లబ్ధిదారులకు అందజేశారు. భారీ స్థాయిలో ఈ-సైకిళ్లను పంపిణీ చేసి చిత్తూరు జిల్లా గిన్నీస్ రికార్డును సృష్టించింది.
ఈ మేరకు గిన్నీస్ ప్రతినిధులు ప్రకటించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు సీఎం. ఈ నేపథ్యంలో కొందరు ఈ సైకిళ్ల లబ్ధిదారులతో కలిసి శాంతిపురం మండలం శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు. ఈ సమయంలో ఈ-సైకిల్ ను నడిపి చంద్రబాబు సందడి చేశారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ సైకిళ్లను పంపిణీ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ -సైకిళ్లను కుప్పంలోని యూనిట్ లో అసెంబ్లింగ్ చేశారు.









