Jabardasth Shanthi Swaroop Counter To Ys Jagan | లేడికి, లేడి గెటప్ కు తేడా తెలీదా మీరెలా ముఖ్యమంత్రి అయ్యారని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశిస్తూ కొందరు కామెంట్లు పెడుతున్నారని జబర్దస్త్ శాంతి స్వరూప్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ వేదికపై లేడీలతో అశ్లీలంగా నృత్యాలు చేశారని జగన్ విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో శాంతి స్వరూప్ స్పందించారు. మంత్రి డాన్స్ వేసింది యువతులతో కాదని లేడి గెటప్ లో ఉన్న తనతో అని అన్నారు. రామచంద్రాపురంలో జనవరి 15న సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో తామే మంత్రిని బలవంతం చేసి డాన్స్ వేసేలా చేసినట్లు పేర్కొన్నారు.
మంత్రి తనతో డాన్స్ చేయలేదని, తానే మంత్రితో డాన్స్ వేశానని ఈ కమెడియన్ చెప్పారు. ‘సంక్రాంతి సంబరాలు’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు హైపర్ ఆది టీంను ఆహ్వానిస్తే తామందరం వెళ్లినట్లు చెప్పారు. అయితే నిజానిజాలు తెలీకుండా జగన్ ఇలా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ భవిష్యత్ ఈవెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. తాను గతంలో వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఇలా లేడి గెటప్ లోనే పాల్గొన్నట్లు, అసలు విషయం తెలుసుకుని జగన్ మాట్లాడి ఉంటే బాగుండేది అని శాంతి స్వరూప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.









