Medaram Maha Jathara News | మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమయ్యింది. జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క-సారాలమ్మ జాతర కన్నులపండుగగా జరగనుంది. అయితే లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల మధ్య చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ చిన్నారులు తప్పిపోతే భక్తసంద్రంలో వారిని గుర్తించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. జాతరలో తప్పిపోయే వారిని గుర్తించేందుకు వొడాఫోన్ సహాయంతో ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్స్ పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
మేడారం చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మన సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఈ కేంద్రాలు ఉంటాయి. అక్కడ పిల్లల, వృద్ధుల ఇతరుల పేర్లను నమోదు చేసి, తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఫోన్ నంబర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం వాటిని నమోదు చేసుకున్న తర్వాత అధికారులు క్యూఆర్ కోడ్ కలిగిన చేతి బ్యాండ్ ను ఇస్తారు. ఒకవేళ పిల్లలు లేదా ఇతరులు జాతరలో తప్పిపోతే క్యూ కోడ్ ను స్కాన్ చేసి అందులో వచ్చిన నంబర్ కు ఫోన్ చేసి చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేర్చవచ్చు. పోలీసులే కాకుండా సాధారణ భక్తులు సైతం ఇలా చేయవచ్చు.









