Jitan Ram Manjhi Bats For Bharat Ratna For Nitish Kumar | దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రకటించాలని కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝి కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జేడీయూ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేసీ త్యాగి నితీష్ కుమార్ కు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝి కూడా ఈ అభ్యర్థనకు మద్దతు ప్రకటించారు.
‘భారతరత్న నితీష్ కుమార్ గారు. ఈ మాట వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది. తన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచే ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను భారతరత్నతో సత్కరించి యావత్ దేశాన్ని ఆశ్చర్య పరుస్తారని నమ్మకం ఉంది’ అంటూ మాంఝి చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపాయి. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి. ఇకపోతే గతంలో మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ఎలాగైతే భారతరత్నతో సత్కరించారో అలాగే నితీష్ కుమార్ కూడా ఈ అత్యున్నత పురస్కారానికి పూర్తి అర్హులు అని కేసి త్యాగి ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ రాశారు. ఇది బీహార్ రాజకీయాలను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన నితీష్ కుమార్ జేడీయూ పార్టీ అది కేసి త్యాగి వ్యక్తిగత అభిప్రాయం అని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.









