Deputy CM Pawan Kalyan About Sankranthi Festival | జూదాలు, పందెం భోగిమంటల్లో కాలాలి.. ఆచారం, సంప్రదాయం సంక్రాంతి వేళ వెలగాలి అని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భావి తరాలకు సంక్రాంతి గొప్పదనాన్ని తెలిపేలా పండుగ చేసుకుందామని పేర్కొన్నారు. సంక్రాంతి ఉత్సవాలకు పిఠాపురం చిరునామా కావాలన్నారు. ఈ మేరకు శుక్రవారం పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను” ప్రారంభించి, ప్రసంగించారు.
మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో… అదే విధంగా మన రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి అనేది ప్రత్యేకంగా ఒక మతానికి నిర్దేశించిన పండుగ కాదని, మన సనాతన ధర్మ మూలాల్లో చెప్పే ప్రకృతి ఆరాధన పండుగ అన్నారు. మూలలను, గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలను కాదని అన్నారు. మన మూలలను మనం మరిచిపోతే సంస్కృతి దారి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి నుంచి… కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి అనే మాటలు పోవాలని, శ్రమైక జీవన సౌందర్యానికి సంక్రాంతి వేదిక కావాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.









