KCR Helps Poor Student For Higher Education | ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు విద్యార్థులకు భరోసాగా నిలిచారు మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్. విద్యార్థుల చదువుల కోసం ఆర్ధిక సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. మంచిగా సదువుకోండి బిడ్డ అంటూ అండగా నిలిచారు.
విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న నవీన్ మరియు అదే గ్రామానికి చెందిన, ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన మరో రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బీటెక్ చదువుతున్న అజయ్‌లను కేసీఆర్ చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను చెల్లించారు. అలాగే వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు వారికి విడివిడిగా చెక్కులు అందించారు. “కష్టపడి మంచిగా చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలి. ఫీజుల కోసం భయపడొద్దు. ఏ సమస్య వచ్చినా నేనున్నా..” అంటూ భరోసా నిస్తూ కేసీఆర్ వారిని ఆశీర్వదించారు.









