Couple Adoption Journey | ఒక మహిళకు మాతృత్వం అనేది జీవితంలో ఒక మధురానుభూతి. తల్లి కావడంతో మహిళ జన్మ పరిపూర్ణం అవుతుందని చెబుతుంటారు.
కానీ కారణాలేవైనా కొంతమందికి ఆ మాతృత్వాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. అలాంటి వాళ్లు తమ బంధువుల పిల్లలనో, అనాథలనో దత్తత తీసుకొని ఆ తల్లితనాన్ని ఆస్వాదిస్తుంటారు.
తాజాగా పిల్లలు లేని ఒక జంట కూడా ఓ బిడ్డను దత్తత తీసుకుంది. ఇందులో ప్రత్యేకత ఏముందంటారా. ఈ వీడియో చూడండి.
బెంగళూరుకు చెందిన ఈ యువ జంటకు పిల్లలు లేరు. దీంతో వారు ఒక అనాథను దత్తత తీసుకోవాలనుకున్నారు.
అందుకోసం అధికారిక వెబ్ సైట్ అయిన సారా అంటే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ని సంప్రదించి ఒక ఆశ్రమం నుంచి బిడ్డను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
వారి పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సారా నుంచి ఆమోదం లభించింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు.
స్వయంగా వెళ్లి ఆశ్రమం నుంచి ఒక కంటిచూపు లోపంతో పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నారు.
ఆ బిడ్డను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆ మహిళ భావోద్వేగానికి గురైంది. తామే కన్న బిడ్డలా అపురూపంగా పెంచుకుంటున్నారు. అడాప్షన్ జర్నీ పేరుతో ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అందులో వారు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి బిడ్డను మొదటిసారి దగ్గరకు తీసుకున్న దృశ్యాలు, ఆ చిన్నారిని పెంచుతున్న దృశ్యాలన్నీ పొందుపరిచారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ విజువల్స్ నెటిజన్ల మనసు దోచుకున్నాయి. ఆ జంట ఆనందం, బిడ్డ సంతోషం చూసిన వారు తమ కళ్లలో నీళ్లొచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దృష్టి లోపంతో జన్మించిన బిడ్డను దత్తత తీసుకుని పెంచడానికి అపారమైన ప్రేమ, అపరిమితమైన ఓర్పు, దయ, ధైర్యం అవసరం.
ఈ జంట దేవుడి కంటే గొప్పది అంటూ ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ పోస్టులు పెడుతున్నారు.
https://www.instagram.com/p/DS-N0syiTTj









