Lionel Messi Chants ‘Jai Mata Di’ | అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి నోట ‘జై మాతా ది’ అని పలికిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అలాగే హిందూ సంప్రదాయాలు, ఆచారాలు మెస్సి మరియు ఇతర ఆటగాళ్లు పాటించారు. ‘ది గోట్ టూర్ ఆఫ్ ఇండియా-2025’ లో భాగంగా మెస్సి తాజగా భారత్ లో పర్యటించారు. కోల్కత్త, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీలో పర్యటించిన అనంతరం మెస్సి మరియు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ గుజరాత్ లోని జామనగర్ కు వెళ్లారు.
ఇక్కడ అనంత్ అంబానీ నిర్వహిస్తున్న ‘వంతరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’కు వెళ్లారు. మెస్సికి అనంత్ అంబానీ ఆయన సతీమణి రాధిక మెర్చంట్ ఘన స్వాగతం పలికారు. వంతరాలో తిరుగుతూ జంతువులను తిలకించారు మెస్సి. ఏనుగులతో కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఆ తర్వాత దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు ఈ అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాళ్లు. దుర్గామాతకు హారతి ఇస్తూ మెస్సి ‘జై మాతా ది’ అని అన్నారు. అలాగే విజ్ఞేశుడి పాదాలకు మెస్సి ప్రాణమం చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలను వంతరా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఇకపోతే అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ గౌరవార్థం ఓ సింహపు పిల్లకు మెస్సి అని నామకరణం చేశారు అనంత్ అంబానీ-రాధిక దంపతులు.









