2 Madhya Pradesh friends find diamond worth Rs 50 lakh after digging for 20 days | చెల్లెళ్ల పెళ్లికోసం కష్ట పడుతున్న ఇద్దరు స్నేహితులకు అదృష్టం కలిసొచ్చింది. రూ.50 లక్షల విలువైన అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోనిది. పన్నా జిల్లాలోని రాణిగంజ్ ప్రాంతానికి చెందిన సతీష్ మరియు సాజిద్ మహ్మద్ స్నేహితులు. సతీష్ కు మాంసం కొట్టు ఉండగా, సాజిద్ కు పండ్ల బండి ఉంది. అయితే నవంబర్ నెలాఖరులో ఈ ఇద్దరు కలిసి కేవలం రూ.200 చెల్లించి సుమారు 60 గజాల మైనింగ్ కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్నారు.
మైనింగ్ మొదలుపెట్టిన కేవలం 20 రోజుల్లోనే జాక్పాట్ తగిలింది. 15.34 క్యారెట్ల నాణ్యమైన వజ్రం స్నేహితులకు లభించింది. దింతో ఇద్దరు స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పన్నాలోని డైమండ్ ఆఫీసులో వజ్రాన్ని డిపాజిట్ చేశారు. త్వరలో జరగబోయే ఆక్షన్ లో దీని విక్రయం జరగనుంది. రూ.50 లక్షల విలువతో ఇది ఆక్షన్ లోకి వెళ్లనుంది.
ఈ సంతోషకరమైన సమయంలో స్నేహితులు మీడియాతో మాట్లాడుతూ..వచ్చిన డబ్బులతో చెల్లెళ్ల పెళ్లి చేయనున్నట్లు చెప్పారు. అలాగే తమ కుటుంబాలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఈ డబ్బులు దోహద పడతాయని వివరించారు. మిగిలిన డబ్బులతో తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ఈ స్నేహితులు పేర్కొన్నారు.









