PM Modi Serious On Telangana BJP MP’s | తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చురకలు అంటించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీ ఎంపీలను, కూటమి సర్కారును ప్రధాని ప్రశంసించారని కథనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబర్ మరియు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలకు గురువారం ఢిల్లీలో ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు.
పెట్టుబడులు అధికంగా ఏపీకి వెళ్తున్నాయని ఇది మంచి పాలనకు సంకేతం అని ప్రధాని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరు సరిగా లేదని అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నేతలు వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని మండిపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను పోషించడంలో నేతలు చాలా వెనకపడ్డారని అన్నట్లు సమాచారం.
మంచి టీంను ఏర్పాటు చేసుకుని బలంగా పోరాడడంలో సమస్య ఏంటని నిలదీసినట్లు, ఇదే సమయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పనితీరును ఉదహరించినట్లు తెలుస్తోంది. ఒవైసీ సోషల్ మీడియాతో పోల్చితే తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా తక్కువగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.









