MLA Rajasingh Comments On Trump Road | తెలంగాణలోని అమెరికా కాన్స్యులేట్ కార్యాలయం (American Consulate Office) ఉన్న రోడ్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరుతో మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) స్పందించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్లో ఎవరి పేరునైనా ఈ రోడ్డు పెట్టవచ్చని ఆయన సూచించారు. యూఎస్ కాన్స్యులేట్ రోడ్డును డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్చాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
“తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అనేకమంది అమరవీరులు ఉన్నారు. వారి పేరు పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు రావడం లేదు?” అని ప్రశ్నించారు. ఆ రోడ్డుకు “భాగ్యనగర్ రోడ్” గా అనే పేరు కూడా పేరు పెట్టవచ్చని సూచించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ పై కూడా విమర్శలు చేశారు. “తెలంగాణ సీఎం ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభం లేదు. అనవసరంగా ప్రభుత్వం దీనిపై కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది” అని ఆరోపించారు.
రతన్ టాటా రోడ్డు.. గూగుల్ స్ట్రీట్..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లకు పేర్లు పేడుతూ తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది. రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్‌తో కలిపే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా (Ratan Tata Road) పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్‌చేంజ్‌ను ఇప్పటికే ‘టాటా ఇంటర్‌చేంజ్’ గా నామకరణం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ విషయమై కేంద్ర విదేశాంగ శాఖకు మరియు యూఎస్ ఎంబసీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాయనుంది.
అదనంగా, గూగుల్ మ్యాప్స్ తో ఆ సంస్థ ప్రపంచ వ్యాప్త ప్రభావాన్ని గుర్తిస్తూ, నగరంలోని ఒక ప్రముఖ రోడ్డును ‘గూగుల్ స్ట్రీట్’ (Google Street) గా పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గూగుల్ సంస్థ యూఎస్ వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాదులోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో, మైక్రోసాఫ్ట్ రోడ్ మరియు విప్రో జంక్షన్ పేర్లతో కూడిన మార్గాలు కూడా త్వరలో నగర మ్యాప్‌లో చోటు చేసుకోనున్నాయి.









