Street Dogs Protect An Infant | పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేసిన ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకున్నాయి. అందులో కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
కానీ, బెంగాల్ లో వీధి కుక్కలు ఒక నవజాత శిశువుకు రాత్రంతా కాపలా కాసి కాపాడాయి. నదియాలోని నబద్వీప్ స్వరూప్‌గంజ్ పంచాయతీ ప్రాంతంలో ఒక నవజాత శిశువును బాత్రూంలో వదిలివెళ్లారు. ఆ శిశువును గమనించిన వీధి కుక్కలు రాత్రంతా ఆ బాలుడికి కాపాలాగా ఉన్నాయి.
తెల్లవారుజామున శిశువు ఏడుపు విన్న నివాసితులు ఉలిక్కిపడ్డారు. స్థానిక పంచాయతీ సభ్యుడు నిర్మల్ భౌమిక్ ఇంటి బాత్రూం సమీపం నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఓ మహిళ ధైర్యంచేసి బిడ్డ దగ్గరకు వెళ్లింది. దీంతో వెంటనే ఆ కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
రాత్రంతా చలిలో ఉన్న ఆ బిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని మొదట నబద్వీప్ మహేశ్‌గంజ్ ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత కృష్ణనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాథమిక చికిత్స తర్వాత రక్షణ కోసం చైల్డ్ ల్యాండ్ అధికారులకు అప్పగిస్తామని వైద్య వర్గాలు తెలిపాయి.









