Six pilgrims killed in train accident at UP’s Chunar station | ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గంగానదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు వెళ్తున్న భక్తులను ఓ రైలు ఢీ కొట్టింది. దింతో ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే వారు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా, ట్రాక్ ను దాటేందుకు యత్నించడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చోపాన్-ప్రయాగ్రాజ్ ఎక్స్ ప్రెస్ రైలులో పలువురు యాత్రికులు చునార్ చేరుకున్నారు. అనంతరం వారు నాలుగవ నంబర్ ఫ్లాటఫార్మ్ పై దిగాలి. కానీ కొందరు యాత్రికులు మాత్రం పట్టాలవైపు దిగారు.
అలా దిగి మూడవ నంబర్ ఫ్లాట్ఫార్మ్ వైపు వెళ్లసాగారు. కానీ ఇదే సమయంలో హౌరా-కల్కా నేతాజీ ఎక్స్ ప్రెస్ రైలు ట్రాక్ పై వచ్చింది. అనంతరం పట్టాలు దాటుతున్న భక్తులను ఢీ కొట్టింది. ఇందులో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఛత్తీస్ ఘడ్ లోని బిలాసపూర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పది మందికి పైగా మృతి చెందిన విషయం తెల్సిందే.









