Rowdy Sheeter Riyaz Killed In Police Encounter | నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన కరుడుగట్టిన నెరస్థుడి రియాజ్ పోలీస్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. కానిస్టేబుల్ ను హత్య చేసి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న రియాజ్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
‘రియాజ్ ను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా, పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. రియాజ్ ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు’ అని డీజీపీ ప్రకటించారు. అలాగే పరారీలో ఉన్న రియాజ్ ను పట్టుకొనేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై కూడా నేరస్థుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని, ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.









