CRDA Building | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)లో నూతన అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం ఆయన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్‌డీఏ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అమరావతి అభివృద్ధి ఇక నిజమైన అర్థంలో ప్రారంభమైందని పేర్కొన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేశారు. రైతుల పోరాట సమయంలో తాను వారి పక్కన నిలిచిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. “మీ త్యాగాలను మరువను. మళ్లీ మీరు ఫలితం అనుభవించేందుకు నేను కృషి చేస్తాను,” అని హామీ ఇచ్చారు సీఎం.
హైదరాబాద్ హైటెక్ సిటీ విజయాన్ని ఉదాహరించుతూ, అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ ఖజానా ఖర్చు లేకుండానే భూముల విలువ పెంచి, ల్యాండ్ పూలింగ్ ద్వారా నగరాన్ని నిర్మిస్తామన్నారు.
అమరావతి భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశమని, నది, పచ్చదనం, గ్రీన్ టెక్నాలజీ కలయికతో ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుందని వివరించారు. రైతులు కేవలం వ్యవసాయదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో, అమరావతి వికసిత భారత్ దిశగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ప్రారంభంతో రాజధాని నిర్మాణ యాత్ర తిరిగి ప్రారంభమైందని వెల్లడించారు.









