VC Sajjanar appointed as new Hyderabad police commissioner | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా టీజీఎస్ ఆర్టీసి ఎండీగా కొనసాగుతున్న వీసీ సజ్జనర్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే ప్రస్తుత హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది.
కాగా సజ్జనర్ తిరిగి పోలీస్ యూనిఫార్మ్ లో కనిపించబోతుండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1996 లో సివిల్స్ లో క్వాలిఫై అయిన సజ్జనర్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో ఐపీఎస్ గా చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇక్కడే కొనసాగుతున్నారు. డీఐజీగా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో సజ్జనర్ కీలక పాత్ర పోషించారు.
2008 వరంగల్ యాసిడ్ దాడి ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినీలపై ముగ్గురు యువకులు యాసిడ్ తో దాడి చేశారు. అనంతరం సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఈ ముగ్గుర్ని ఎన్కౌంటర్ లో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించారు. అప్పుడు సజ్జనర్ వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో దిశా రేప్ అండ్ మర్డర్ కేసులో జరిగిన ఎన్కౌంటర్ ఘటన తెల్సిందే.
ఈ సమయంలో సజ్జనర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. సైబరాబాద్ కమిషనర్ గా విధులు నిర్వహించిన సజ్జనర్ ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టింది. తాజగా ప్రభుత్వ నిర్ణయంతో సజ్జనర్ మళ్లీ ఖాకీ చొక్కాతో కనిపించనున్నారు.








