Deputy Cm Pawan Kalyan News | కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించనున్నట్లు స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బ తిన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి పడుతోందనీ, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బ తిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం…ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన పవన్ ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దసరా తరవాత అక్కడికి వెళ్ళి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తానని చెప్పారు. రైతాంగంతోను, ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.









