Russia Announces Cancer Vaccine Ready For Clinical Use | వైద్య ప్రపంచంలో రష్యా దేశం విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ను నయం చేసే విధంగా రష్యా వాక్సిన్ ను అభివృద్ధి చేసింది.
కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో కూడా రష్యా ‘స్పుత్నిక్ వి’ కోవిడ్ వాక్సిన్ ను రూపొందించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తాజగా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రేడియాలజీ మెడికల్ రీసర్చ్ సెంటర్, గమలేయ రీసర్చ్ సెంటర్ మరియు ఇవన్నికొవ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థలు సంయుక్తంగా క్యాన్సర్ ను నయం చేయడానికి ‘ఎంటెరోమిక్స్’ వాక్సిన్ ను రూపొందించింది.
ఈ వాక్సిన్ మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. ఇది క్యాన్సర్ కణాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేసే విధంగా రోగనిరోధక వ్యవస్థను తయారు చేస్తుంది. mRNA వ్యాక్సిన్ శరీరంలో నిర్దిష్ట ప్రోటీన్ ను ఉత్పత్తి చేసే విధంగా కణాలను ప్రేరేపిస్తుంది.
ప్రీ-క్లినికల్ ట్రయల్స్ లో ఈ వాక్సిన్ క్యాన్సర్ ట్యూమర్స్ పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు, క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించడంలో విజయవంతం అయ్యిందని రష్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అతి త్వరలోనే క్యాన్సర్ బాధితులపై పరీక్షించనున్నారు. దేశ పౌరులకు దీనిని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు.









