Balapur Laddu Auction News | హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సాహం కన్నుల పండుగగా సాగుతుంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి విగ్రహాలు నిమజ్జనం కోసం బయలుదేరాయి.
ఇదే సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాటకు ప్రత్యేక స్థానం ఉంది. శనివారం ఉదయం ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డూ వేలం పాట ఘనంగా సాగింది. ఈ సారి లడ్డూ భారీ ధర పలికింది.
రూ.35 లక్షలకు కర్మనఘాట్ కు చెందిన దశరథ గౌడ్ అనే వ్యక్తి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి దశరథ గౌడ్ ను సన్మానించింది. బాలాపూర్ లడ్డును కైవసం చేసుకోవడానికి గత ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు దశరథ గౌడ్ పేర్కొన్నారు.
బాలాపూర్ గణేశుడి లడ్డూ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ సారి దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ సారి రూ.4.99 లక్షల అధికంగా పలకడం విశేషం. గతేడాది ఈ లడ్డూను రూ.30.01 లక్షలకు కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. 1994లో తొలి సారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం అయ్యింది. ఆ ఏడాది లడ్డూ రూ.450 పలికింది.









