Rahul Gandhi alleges ‘massive’ voter fraud | కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ. దేశంలో ఐదు రకాల ఓట్ల చోరీ జరుగుతుందని వివరించారు.
ఈ మేరకు ఢిల్లీలో ‘ఓట్ల చోరీ’ అనే అంశంపై మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ బీజేపీతో కలిసి కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంటు స్థానాన్ని ఇండియా కూటమి నుంచి లాక్కున్నారని ఆరోపించారు.
ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని మహాదేవపూర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్ష ఓట్లు నకిలీవని తమ పరిశోధనలో తేలిందని రాహుల్ పేర్కొన్నారు. ‘ఆ నియోజకవర్గంలో నకిలీ ఓటర్లు 11,965. ఫేక్ & చెల్లని చిరునామాలతో 40,009, ఒకే చిరునామాలో బల్క్ ఓటర్లు 10,452, చెల్లని ఫోటోలు ద్వారా 4,132, ఫారం 6 దుర్వినియోగం ద్వారా 33,692 నకిలీ ఓట్లను సృష్టించారు’ అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే మహారాష్ట్రలో కేవలం ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే మహారాష్ట్రలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల మధ్య కోటి నకిలీ ఓట్లు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఓటర్ల జాబితాను తమకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందని అన్నారు. ఓటరు జాబితా దేశ సంపద అని రాహుల్ నొక్కిచెప్పారు.









