Friday 22nd August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గతంలో ఉగ్రవాది..ప్రస్తుత సిరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ

గతంలో ఉగ్రవాది..ప్రస్తుత సిరియా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ

Trump meets Syrian leader Ahmed al-Sharaa in Saudi Arabia | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా బుధవారం సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కారణం సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికంటే ముందు అహ్మద్ అల్ షరాకు గతంలో ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా తో సంబంధాలు ఉండేవి. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం అల్ షరాపై 10 మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.

కారణం అల్ షరా గతంలో ఇరాక్ లో ఉన్న సమయంలో అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడ్డాడు. అయితే గతేడాది సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అస్సద్ ప్రభుత్వాన్ని పడగొట్టి అల్ షరా సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో గత డిసెంబర్ లో అల్ షరా తలపై ఉన్న రివార్డును అమెరికా తొలగించింది. డొనాల్డ్ ట్రంప్, సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో బుధవారం భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ సమావేశంలో వీరు కలుసుకున్నారు.

ఈ సమావేశం రియాద్‌లో జరిగిందని, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ చర్చల్లో పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ సమావేశంలో సిరియాపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడం, సిరియా-అమెరికా సంబంధాల సాధారణ స్థితికి తీసుకురావడం, మధ్యప్రాచ్యంలో శాంతి, ఆర్థిక సహకారంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

ట్రంప్ తన పర్యటన సందర్భంగా సిరియాపై ఆంక్షలను తొలగించాలనే నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిని సిరియాకు “శాంతి అవకాశం”గా అభివర్ణించారు. ఈ నిర్ణయం సౌదీ యువరాజుతో చర్చల తర్వాత తీసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఈ భేటీ ద్వారా సిరియాలో రాజకీయ స్థిరత్వం, ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడం, ఆర్థిక పునర్నిర్మాణంపై ట్రంప్ దృష్టి సారించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ భేటీని అంతర్జాతీయ సమాజం ఆసక్తితో గమనిస్తోంది, ఎందుకంటే ఇది మధ్యప్రాచ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేయడంతో సిరియా రాజధాని డమస్కస్ లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.

You may also like
hydraa saves rs 400 crores value government property
రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
online games
ఆన్ లైన్ మనీ గేమ్స్ ఇక నేరమే.. ఉల్లంఘిస్తే భారీగా శిక్షలు!
aishwarya rai
సోషల్ మీడియాపై ఐశ్వర్యారాయ్ సంచలన వ్యాఖ్యలు!  
justice sudershan reddy
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions