Monday 23rd December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్

కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్

Red alert for Kostanhra

-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర తుపాను
-నెల్లూరుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం
-రేపు మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం
-ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందన్న ఐఎండీ
-కుండపోత వానలు… 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడి

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మిగ్జామ్’ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని, క్రమంగా ఉత్తర దిశగా ఏపీ తీరానికి సమాంతరంగా పయనించి డిసెంబరు 5 మధ్యాహ్నం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపింది. తీవ్ర తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు… డిసెంబరు 4న ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. డిసెంబరు 6న ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇక, రాయలసీమలో డిసెంబరు 4న చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో డిసెంబరు 5న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణపైనా ‘మిగ్జామ్’ తుపాను ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. డిసెంబరు 4న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందని తెలిపింది. డిసెంబరు 5న చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. తుపాను తీరం దాటే సమయంలో ఏపీ కోస్తా జిల్లాల్లో ఒకటిన్నర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ‘మిగ్జామ్’ తీవ్ర తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలపై అత్యధికంగా ఉంటుందని తెలిపింది.

You may also like
మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం
వారిపై చర్యలు తీసుకుంటాం..అల్లు అర్జున్ వార్నింగ్
‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు’
‘సలార్-2 నా కెరీర్ లో బెస్ట్ మూవీగా ఉంటుంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions