- అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడు
- ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి
Mira Road Murder | దేశ వాణిజ్య రాజధాని ముంబైలో (Mumbai) మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని వారు నివసిస్తున్న ఫ్లాట్ లో పాశవికంగా హత్యచేశాడు ఓ దుర్మార్గుడు.
అనంతరం ఆమె మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికి, వాటిని ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఘటనను గుర్తించారు.
మనోజ్ సానే (Manoj Sane) అనే 56 ఏళ్ల వ్యక్తి, 36 ఏళ్ల సరస్వతి వైద్య (Saraswathi Vaidya)తో కలిసి మీరా రోడ్ (Mira Road) లోని గీతా నగర్ ఫేజ్ 7లోని ఫ్లాట్ లో నివసిస్తున్నారు.
బుధవారం, నివాస భవనంలోని వ్యక్తులు ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, నయా నగర్ పోలీస్ స్టేషన్ నుండి ఒక బృందం ఫ్లాట్‌కు చేరుకుని, తలుపులు పగులగొట్టి, కుళ్ళిపోయిన మహిళ శరీర భాగాలను గుర్తించింది.
మృతదేహం సరస్వతి వైద్యదిగా గుర్తించారు. ఆమె తన సహజీవన భాగస్వామి మనోజ్ సానేతో కలిసి అతని ఫ్లాట్‌లో గత మూడేళ్లుగా నివసిస్తున్నారు. పోలీసులు సానేను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొన్ని రోజుల క్రితం తన భాగస్వామిని హత్య చేసి, ఆమె మృతదేహంతో ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు.
మనోజ్ సానే.. సరస్వతి వైద్యను హత్య చేసి, గదిలో దొరికిన చెట్లు కత్తిరించే ఓ కట్టర్‌తో ఆమె మృతదేహాన్ని 20 ముక్కలుగా నరికినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్‌లో శరీర భాగాలను పారవేసేందుకు ఉపయోగించే నల్లటి ప్లాస్టిక్ బ్యాగులు కూడా బయటపడ్డాయి.
ప్రెషర్ కుక్కర్‌లో శరీర భాగాలను ఉడకబెట్టి, ఇంట్లో దొరికిన కొన్ని భాగాలను బకెట్లలో దాచిపెట్టాడని పోలీసులు వెల్లడించారు.
ఫ్లాట్‌లోని కిచెన్‌లో మూడు బకెట్లను పోలీసులు కనుగొన్నారు. వాటిలో శరీర భాగాలు మరియు రక్తం ఉన్నాయి. ఫ్లాట్‌లోని వివిధ గదుల్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు నిందితుడు ఉపయోగించిన ఎయిర్ ఫ్రెషనర్ల డబ్బాలు కూడా లభ్యమైనట్లు పోలీసులు వివరించారు.
మృతురాలి వెంట్రుకలను పడకగదిలో విడిగా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్ నుండి మహిళ మృతదేహంలోని అనేక తరిగిన ముక్కలు లభించగా, కొన్ని శరీర భాగాలు ఇంకా కనిపించలేదని పోలీసు అధికారులు తెలిపారు.