RBI 2000 Note News | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2000 కరెన్సీ నోటును చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.
అయితే ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుంది. తక్షణం అమలులోకి వచ్చేలా రూ.2000 డినామినేషన్ నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులకు సూచించింది.
ఇదిలా ఉండగా, ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయడం లేదా వాటిని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో 2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం కల్పించింది.
అయితే ఒకసారి గరిష్టంగా పది రూ.2 వేల నోట్లను అంటే 20 వేల రూపాయలను డిపాజిట్ చేసుకోవచ్చునని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో రూ. 3.62 లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది.
రూ. 2000 నోటును మార్చుకొండిలా..
- ఆర్బీఐ రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నందు వల్ల ప్రజలు తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. ఈ నోటుకు బదులుగా రూ. 500, రూ. 100 నోట్ల రూపంలో తిరిగి పూర్తి మొత్తం మీకు చెల్లిస్తారు.
- బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను ప్రజలు తమ తమ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు.
- అయితే రోజుకు కేవలం రూ. 20 వేలు మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే ఒక రోజుకు 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయవచ్చు.
- ఒక వేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ. 2000 నోటును మార్చుకోవచ్చు.
2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేత
రూ. 2000 నోటును ఆర్బీఐ 2016లో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో చెలామణిలో ఉన్న రూ. 500 మరియు రూ. 1000 నోట్ల రద్దు చేసినట్లు ప్రధాని ప్రకటించిన తర్వాత ఆర్థిక వ్యవస్థ యొక్క కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి ఈ రెండు వేల నోటును విడుదల చేసింది.
అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరింది.
దీంతో 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కి ముందు జారీ చేశారు.
ఈ నోట్ల మొత్తం విలువ 2018 మార్చి 31 నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది.





