‘124-year-old’ voter becomes face of INDIA bloc protest against alleged voter fraud | 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని విపక్ష ఎంపీలు ఆరోపిస్తూ సోమవారం నిరసన ర్యాలీ చేపట్టిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో మంగళవారం కూడా బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ మరియు విపక్ష ఎంపీలు పార్లమెంటు వెలుపల నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీ ప్రియాంక గాంధీ ధరించిన ‘124 ఏళ్ల మింతా దేవి’ టీ షర్ట్ చర్చనీయాంశంగా మారింది.
కాగా ఇటీవల లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ అనే అంశంపై మీడియాకు ప్రజెంటేషమ్ ఇచ్చారు. ఇందులో బీహార్ కు చెందిన మింతా దేవి గురించి కూడా ప్రస్తావించారు. ఓటరు ఐడీ లో ఆమె వయసు 124 ఏళ్ళు ఉన్నట్లు రాహుల్ వెల్లడించారు.
ఇది ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తి వయసు కంటే ఎక్కువ అని ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇలాంటివి నిదర్శనం అని చెప్పారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రియాంక గాంధీ మరియు ఇతర విపక్ష ఎంపీలు మింతా దేవి ఫొటోతో కూడిన టీ షర్ట్ ను ధరించారు. అలాగే 124 నాటౌట్ అని ముద్రించిన టీ షర్ట్ లను ధరించారు.









