Montha Toofan Preparedness | మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఏపీలోని కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల వర్షాలు మొదలయ్యాయి. మొత్తంగా ఏపీలో 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై మొంథా ప్రభావం చూపనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. “మొంథా”తుఫాను ప్రాంతాల ప్రజలకు సురక్షిత ఆశ్రయం, సత్వర సాయం అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారం, మెడికల్ క్యాంపులు, త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవలన్నారు.
అలాగే పునరావాస కేంద్రాల్లోని వారికి రూ.3000 నగదు, 25 కేజీల బియ్యం ,నిత్యవసరాల పంపిణీ చేయాలన్నారు. పీఎంవో సమన్వయ బాధ్యతలు మంత్రి లోకేష్ కు అప్పగించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయాన్ భరోసా ఇచ్చారు.









