RGV Tweet On Mirai | తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా ఇటీవల విడుదలైన ఓ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ‘మిరాయ్’ చిత్రంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జా, కార్తీక్, విశ్వ ప్రసాద్ లకు అభింనందనలు. బాహుబలి తర్వాత ఏ సినిమా గురించి ఇంతలా ప్రశంసలు వినలేదు. ముఖ్యంగా, 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలలో కూడా తాను ఇంతటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) చూడలేదు.
‘మిరాయ్’ చూశాక, ఇంత గ్రాండ్‌గా వీఎఫ్ఎక్స్ ఎప్పుడు చూశానో కూడా గుర్తుకు రావడం లేదు. “మొదట విలన్ పాత్రకు మనోజ్‌ను తీసుకోవడం సరైన నిర్ణయం కాదేమో (మిస్‌కాస్ట్) అనుకున్నాను. కానీ, సినిమాలో అతని అద్భుతమైన నటన చూశాక, నా అభిప్రాయం తప్పని తెలియడంతో నన్ను నేనే చెంపదెబ్బ కొట్టుకున్నాను.
“ఇంత భారీ యాక్షన్ సినిమాను మోయడానికి తేజ వయసు సరిపోదేమోనని భావించాను, కానీ ఆ విషయంలో నా అంచనా రెండుసార్లు తప్పని నిరూపితమైంది” అంటూ వర్మ తనదైన శైలిలో రాసుకొచ్చారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రతి విభాగంపై పట్టు సాధించడం వల్లే ‘మిరాయ్’ ఒక అద్భుతమైన కలలా రూపుదిద్దుకుందని, కథనంలో ఆయన చూపిన ప్రత్యేకత అసాధారణమని అన్నారు. విజువల్స్, నేపథ్య సంగీతం (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్), స్క్రీన్‌ప్లే నిర్మాణం అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.









