YS Jagan Call For Party Leaders | తిరుమల వేంకటేశుని (Tirumala Laddu) లడ్డూ వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు గతంలో టీటీడీ అనుసరిస్తున్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించినట్లు చెప్తోంది.
దీంతో అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య మాటల, సవాళ్ల యుద్ధం నడుస్తోంది. డిప్యూటీ సీఎం ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కూటమి నేతలు సైతం ఆలయాలను సందర్శిస్తూ, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని జగన్ సూచించారు.
అదే రోజు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ ఈ నెల 30 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ధార్మిక కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చింది.