Ys Sharmila News | ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందిస్తూ టీడీపీ, జనసేన మరియు వైసీపీలపై దుమ్మెత్తిపోశారు.
తెలుగు జాతికి నేడు చీకటి రోజు అని పేర్కొన్న షర్మిల ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ తెలుగు జాతికి తీరని ద్రోహం చేశాయన్నారు.
రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆరెస్సెస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులుగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఓటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలుగు బిడ్డ, న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే ప్రధాని మోదీతో స్వప్రయోజనమే ముఖ్యమా అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల ప్రశ్నించారు. పోటీలు పడి మోదీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందని నిలదీశారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు వైసీపీ సిగ్గుపడాలన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ, ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింత అని షర్మిల ఎద్దేవా చేశారు.









