XXX vs Union of India: Justice Varma ‘hides’ identity in Supreme Court plea | ఢిల్లీలోని అధికారిక నివాసంలో భారీగా నగదు కట్టలు లభ్యం అయ్యాయని ప్రస్తుత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తీవ్రమైన ఆరోపణలు ఎదురుకుంటున్న విషయం తెల్సిందే.
తాజగా ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతర్గత విచారణ నివేదికను అలాగే తనను జడ్జి పదవి నుంచి తొలగించాలని సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సును సవాల్ చేస్తూ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే పిటిషన్ లో తన పేరు స్థానంలో ఆయన XXX అని ఉపయోగించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సాధారణంగా లైంగిక బాధితులు, మైనర్ల పిటిషన్లలో ఇలా xxx అని వాడుతారు. కానీ జస్టిస్ యశ్వంత్ వర్మ తన గుర్తింపును దాచిపెట్టి, ఇలా అభివర్ణించుకున్నారని తెలుస్తోంది.
‘XXX vs యూనియన్ ఆఫ్ ఇండియా’ పేరిట యశ్వంత్ వర్మ జులై 17న పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నగదు కట్టలు దొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో అంతర్గత విచారణ కమిటీ వేశారు.
ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది నిజమే అని నిర్ధారించింది. దింతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ వర్మకు సీజేఐ సూచించారు. కానీ జస్టిస్ వర్మ అంగీకరించకపోవడంతో అభిశంసనకు సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రికి సీజేఐ లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో తన గుర్తింపును దాచి జస్టిస్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.









