Water-mixed diesel found in CM Mohan Yadav convoy vehicles | కల్తీ డీజిల్ కారణంగా ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయే నిలిచిపోయింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని కార్లలోనే నీళ్లు కలిపిన డీజిల్ ను నింపారు పెట్రోల్ పంపు సిబ్బంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గురువారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాట్లామ్ లో జరిగే ఓ కార్యక్రమానికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో దోసిగావ్ అనే ప్రాంతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని 19 కార్లకు డీజిల్ కొట్టించారు.
ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించగానే వరుసగా 19 కార్లు ఆగిపోయాయి. దింతో అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. కార్లు రోడ్డుపై మొరాయించడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ క్రమంలో సిబ్బంది కార్లను తోసుకుంటూ రోడ్డు పక్కకు తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని కార్లు ఒక్కసారిగా నిలిచిపోయిన విషయం తెలుసుకున్న స్థానిక యంత్రాంగం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం కార్లను పరిశీలించారు. చివరకు డీజిల్ ట్యాంకు తెరిచి చూడగా, అందులో నీళ్లు కలిసిన డీజిల్ కనిపించింది.
దింతో అక్కడివారు ఖంగు తిన్నారు. వెంటనే పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. సదరు పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకున్న వాహనదారులు కూడా తమ వాహనాలు నిలిచిపోయాయని ఫిర్యాదు చేశారు. పెట్రోల్ పంపును తనిఖీ చేసి కల్తీ జరిగిందని నిర్ధారించారు.
దింతో పెట్రోల్ బంకును సీజ్ చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి కోసం ఇండోర్ నుండి మరో కాన్వాయ్ ను తెప్పించారు.