‘Vote chori’ protest | 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సహకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బీహార్ లో ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ, ‘ఓట్ చోరీ’ జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు సోమవారం ఢిల్లీలో ‘పార్లమెంట్ టూ ఈసీ’ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎంపీ ప్రియాంక గాంధీ సహా లోకసభ, రాజ్యసభ లోని విపక్ష కూటమికి చెందిన 300 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఓట్ల చోరీ జరిగిందని వారు నినాదాలు చేశారు.
అయితే ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు సంసద్ మార్గ్ లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్లను దూకేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎంపీలను అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుండి తరలించారు.









