Viral News | చనిపోయిన శునకానికి సంవత్సరికం ఘనంగా నిర్వహించారు ఓ ప్రభుత్వ ఉద్యోగి. మనుషుల్లో స్వార్ధం, ధనాపేక్ష, అహంకారం పెరిగిపోయాయనే కారణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నోబుల్ పెళ్లి కూడా చేసుకోకుండా శునకాలనే పెంచుకుంటున్నాడు.
శునకాలనే కుటుంబ సభ్యులుగా భావిస్తూ గత 15 సంవత్సరాలుగా వాటినే పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతేడాది మార్చి 24 తేదీన తన మనవరాలుగా భావించే ఇరుగు అక్షితాదేవి అనే శునకం మరణించింది.
సోమవారం నాటికి సంవత్సరం ముగియడంతో స్థానిక చర్చిలో సంవత్సరికం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరణించిన శునకం జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం వచ్చిన వారికి భోజనాలు పెట్టి కుక్కపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.
దీనికి సంబంధించిన బ్యానర్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. చనిపోయిన శునకం అక్షితాదేవికి నాన్న బిట్టు, అన్న బుడి, చెల్లి రూపదేవి ఉన్నాయి.