Veteran Actor Kota Srinivasa Rao Dies At 83 | తెలుగు సినీ ప్రపంచంలో తన విలక్షణ నటనతో ప్రత్యేక ‘కోట’ ను నిర్మించుకున్న శ్రీనివాసరావు ఇకలేరు.
ఆదివారం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. విలన్, కమెడియన్, తండ్రిగా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్దుల్ని చేసిన కోట మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.
కేవలం నతనతోనే కాకుండా ఆయన ఎమ్మెల్యే గా గెలిచి ప్రజలకు సేవ చేశారు. 1942 జూన్ 10న కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన జన్మించారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూనే రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్ కోట శ్రీనివాసరావును ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన వెండితెర నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 750కి పైగా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో తొమ్మిది నంది పురస్కారాలు, ఒక సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించారు.
1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కాగా 2010లో ఒక్కగానొక్క కుమారుడు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు జరగనున్నాయి.