Nirmala Sitaraman Slams Obama | దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అమెరికా లో పర్యటిస్తున్న సందర్బంగా అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ లీడర్ బరాక్ ఒబామా (Barack Obama) మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భారత్ లో మైనారిటీ వర్గాల పైన జరుగుతున్న దాడిని అమెరికా ప్రశ్నించాలని, భారత్ లో మైనారిటీ వర్గాల రక్షణ కోసం అమెరికా నిలబడాలని ఈ విషయాలపై మోదీతో చర్చించాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కి (Joe Biden) సలహా ఇచ్చారు.
ఇలా మోదీ అమెరికా పర్యటనలో ఉండగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒబామా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitaraman Slams Obama) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు ప్రస్తావించకుండా, ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయ ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“ప్రధానమంత్రి అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు భారతీయ ముస్లింల గురించి ప్రకటనలు ఇవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
సిరియా, యెమెన్, సౌదీ అరేబియా మరియు ఇరాక్‌తో సహా ఆరు ముస్లిం-ఆధిపత్య దేశాలలో బాంబు దాడులు ఆయన పాలనలో జరిగాయి. ఆయా దేశాల్లో యుద్ధం లాంటి పరిస్థితులు కొనసాగాయి.
ఆ దేశాలపై 26,000 బాంబులు పడ్డాయి. ఆయన భారతదేశం గురించి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే, భారతీయులు ఆ మాజీ అధ్యక్షుడిని ఎలా విశ్వసిస్తారు?” అని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో చెప్పుకొచ్చారు.
తొమ్మిదేళ్ల పాలనలో ప్రధాని మోదీకి లభించిన 13 అత్యున్నత అవార్డుల్లో ఆరు ముస్లిం ఆధిపత్య దేశాలు ప్రదానం చేశాయని గుర్తు చేశారు. తాజాగా ఈజిప్ట్ కూడా మోదీని గౌరవించిన తీరును ప్రస్తావించారు.
ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ (Himanta Biswa Sharma) ట్విట్టర్ వేదికగా బరాక్ ఒబామాని హుస్సేన్ ఒబామా అవి వ్యాఖ్యానించడం కొసమెరుపు.