Kishan Reddy Letter To CM Revanth | అంబర్ పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (Union Minister G. Kishan Reddy) శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
లేఖ యథాతథంగా..
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, నమస్కారం!
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రూ. 1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం వివిధ దశలలో ఉంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలకు 33 జిల్లాలు కూడా తక్కువ సమయంలోనే జాతీయ రహదారులతో అనుసంధానించబడడం చాలా గొప్ప విషయం.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 265 కోట్ల వ్యయంతో NH163 (గతంలో NH-202) మీద నగరంలోని అంబర్ పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్ ను నిర్మించింది. 5 మే, 2025 నాడు కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ఈ ఫ్లై ఓవర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతోపాటుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా పాల్గొన్నారు.
ఫ్లై ఓవర్ కు అవసరమైన భూసేకరణ పూర్తి కానందున, ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగి, ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్నప్పటికీ ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డుతగులుతుండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ ఫ్లై ఓవర్ 2018లో మంజూరు అయినప్పటికీ లేని సమస్యలు సృష్టించి భూసేకరణ పూర్తి కాకుండా కుట్రలు చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగనివ్వకపోవడంతో ఈ రహదారిగుండా ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన శ్రీ కె. చంద్రశేఖర రావు గారు మరియు మీకు అనేకసార్లు తెలియజేయడం జరిగింది. తెలంగాణ మంత్రులకు స్వయంగా కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు కూడా అనేకసార్లు తెలియజేశారు. నేను కూడా GHMC కమీషనర్ గారు, ఇతర సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి అనేకసార్లు మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసినప్పటికీ, సమస్య ఒక కొలిక్కి రాలేదు. భూసేకరణకు సంబంధించిన భూమికి రూ. 2.54 కోట్ల పరిహారం లబ్ధిదారునికి ప్రభుత్వం చెల్లించినప్పటికీ మధ్య దళారులు అడ్డుకుంటున్నారు.
కావున, ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా చొరవ చూపించి, సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత GHMC/ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించటానికి సహకరించాలని కోరుతున్నాను.
ధన్యవాదాలు,
భవదీయ
జి. కిషన్ రెడ్డి.










