Wednesday 2nd April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > Ugadi 2025: ఉగాది రోజు ఈ పనులు చేస్తే అన్నింటా శుభం!

Ugadi 2025: ఉగాది రోజు ఈ పనులు చేస్తే అన్నింటా శుభం!

Ugadi 2025

Ugadi 2025 | సనాతన హిందూ సంప్రదాయంలో ఒక విశిష్టమైన పండుగ ఉగాది (Ugadi). ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం. ఉగాదితోనే తెలుగు సంవత్సరం ఆరంభమవుతుంది.
తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి పండుగ ఉగాది. తెలుగుతోపాటు కన్నడిగులకు కూడా ఇది నూతన సంవత్సర ఆరంభం.

ఉగాది అనేది యుగాది అనే సంస్కృత పదం నుండి ఉద్భవించించింది. యుగాది అనేది యుగం మరియు ఆది అనే రెండు పదాల కలయిక. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం అని అర్థం.
తెలుగు సంవత్సరం తొలి రోజైన చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది పర్వదినం జరుపుకొంటాం. ఇంగ్లిష్ క్యాలెండర్ లో ఈ ఏడాది మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరాది ఉగాది పండుగ వచ్చింది.

హిందూ పురాణాల ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్మిక. హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ.. కాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉంటుంది. ప్రకృతితో ముడిపడి ఉంటుంది.
అదే విధంగా ఉగాది కూడా వసంత రుతువు రాకను సూచిస్తుంది. ఈ పండుగ నుంచి ప్రకృతి కొత్త రూపు సంతరించుకుంటుంది. చెట్ల కొత్త చిగురులతో, పుష్పాలతో ప్రకృతి ఆహ్లాదకరంగా మారుతుంది.

ఉగాది పండుగను శుభకార్యాలకు, వ్యాపారాల ప్రారంభానికి అనువైన సమయంగా భావిస్తారు. ఇంటిని సరికొత్తగా మామిడి తోరణాలు, పూలతో అలంకరించడం, కొత్త దుస్తులు ధరించడం, రుచికరమైన వంటలు తయారు చేయడం వంటివి ఈ పండుగలో ప్రధాన ఆకర్షణలు.

ఉగాది రోజున చేయాల్సిన పనులు
తైలాభ్యంగన స్నానం: ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయడం సంప్రదాయం. ఇది శారీరక శుద్ధితోపాటు మానసిక ప్రశాంతతను ఇస్తుందని విశ్వాసం. కుదిరితే నదీస్నానం చేయడం శుభప్రదం.
ఇంటి అలంకరణ: ఉగాది అంటే తొలి తెలుగు పండుగ. ఇల్లంతా మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకోవాలి. ఇంటి ముందు రంగవల్లికలు వేయాలి. ఇది సంపద, ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు.
కొత్త బట్టలు: కుటుంబ సభ్యులందరూ కొత్త దుస్తులు ధరించి పండుగ సంబరాల్లో పాల్గొంటారు.
ప్రత్యేక పూజలు: ఉగాది పండుగ రోజు ఆది దేవుడు గణపతి, లక్ష్మీ నారాయణ, ఉమా మహేశ్వర, బ్రహ్మ దేవుడు వంటి దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయా దేవతల అష్టోత్తరాల పారాయణం చేస్తారు. ఉగాది రోజున దమనేన పూజ చేయడం సంప్రదాయం. దమనం అంటే ఒక సుగంధ వెదజల్లే పత్రి. దమనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకూ ఒక దేవతా మూర్తిని నియమ నిష్టలతో పూజలు చేస్తారు. చైత్ర శుక్ల పాడ్యమినాడు బ్రహ్మను.. విదియ రోజున శివుడిని, తదియ నాడు గౌరీ శంకరులను, చతుర్థి రోజున వినాయకుడిని, ఇలా పౌర్ణమి వరకు వివిధ దేవతామూర్తులకు పూజలు చేస్తారు.

ఉగాది పచ్చడి: ఉగాది పండగ రోజు అన్నింటిలో ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి. ఇది తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు షడ్రుచుల సమ్మేళనం. బెల్లం, చింతపండు, వేపపూత, కారం, లేత మామిడి, ఉప్పు కలుపుతారు. ఉగాది పచ్చడిలోని ఈ ఆరు రుచులు మనిషి జీవితంలోని ఆరు అనుభవాలకు ప్రతీకగా భావిస్తారు. సుఖం, దుఖం, కోపం, ఉత్సాహం, ఓర్పు, సవాళ్లకు గుర్తుల్లాంటివి.
వంటలు: ఉగాది పచ్చడితో పాటు పులిహోర, బొబ్బట్లు, బూరెలు, సేమియా పాయసం వంటి రుచికరమైన పదార్థాలు తయారు చేస్తారు.
ఆలయ దర్శనం: ఉగాది పండుగ రోజు ఆలయ సందర్శన చేయడం చాలా మంచిది. తెలుగు సంవత్సారాది రోజున భగవంతుడి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పంచాంగ శ్రవణం: ఉగాది పండుగ రోజు కచ్చితంగా చేయాల్సిన మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. ఉదయం లేదా సాయంత్రం ఆలయాలు, బహిరంగ వేదికల్లో పంచాంగ శ్రవణం జరుగుతుంది. అంటే ఈ సంవత్సర జాతక ఫలితాలను పురోహితులు చదివి వినిపిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాలు: ఉగాది అంటే ఉల్లాసం, ఉత్సాహం. అనేక చోట్ల పంచాంగ శ్రవణంతోపాటు కవిసమ్మేళనాలు, సంగీత కచేరీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతా కలిసి ఆటపాటలతో వేడుకలు జరుపుకొంటారు.
పండగ అంటే సంతోషాలను పంచుకోవడం లాంటిది. అందుకే ఉగాది పండుగ నాడు కూడా పేదలకు మీరు చేయగలిగినంత దానం చేయండి. వాళ్ల ఆనందానికి కారణంగా నిలవండి. అది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది.
చేయకూడని పనులు
కోపం, వివాదాలు: సంవత్సరం తొలి రోజు వీలైనంతవరకు సంతోషంగా, శాంతియుతంగా గడపాలి. కోపం, గొడవలు లాంటివి మానుకోవాలి.
ఋణాలు తీసుకోవడం: ఈ శుభ దినంలో కొత్త రుణాలు తీసుకోవడం లేదా డబ్బు అప్పివ్వడం చేయకూడదని కొందరు నమ్ముతారు.
మాంసాహారం: సంప్రదాయంగా ఉగాది రోజు శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తినడం నిషిద్ధంగా భావిస్తారు.

చివరగా, ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. జీవితంలోని సమతుల్యతను గుర్తు చేసే ఒక తాత్విక సందేశం. ఉగాది పచ్చడి రుచుల్లాగే, జీవితంలో సుఖాలు, దుఃఖాలు రెండూ ఉంటాయని, వాటిని సమానంగా స్వీకరించాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions