Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > జేబీఎస్ లో ఆర్టీసీ ఎండీ తనిఖీ.. బస్ లో ప్రయాణించి టికెట్ ఇచ్చిన సజ్జనార్!

జేబీఎస్ లో ఆర్టీసీ ఎండీ తనిఖీ.. బస్ లో ప్రయాణించి టికెట్ ఇచ్చిన సజ్జనార్!

sajjanar
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలుపై క్షేత్ర పరిశీలన

VC Sajjanar Vists JBS | హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.

జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్(రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ను అందజేశారు.

అనంతరం టీఎస్ఆర్టీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని అన్నారు.

మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.

ఉచిత బస్ ప్రయాణ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి.. వాటిపై 40 వేల మంది సిబ్బందికి అవగాహన కల్పించామని గుర్తు చేశారు.

పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ స్థానికతను నిర్థారించుకునేందుకు తమ ఆధార్ కార్డులను సిబ్బందికి చూపించి.. సంస్థకు సహకరించాలని కోరారు.

ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు ప్లాన్ రూపొందించామని చెప్పారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి..  సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033  ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (గ్రేటర్ హైదరాబాద్ జోన్) వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుష్రోషా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

You may also like
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions