Trump’s new claim on India-Pakistan conflict | భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజగా ఆయన మాట్లాడుతూ అమెరికా జోక్యం మూలంగానే భారత్-పాక్ మధ్య యుద్ధం ముప్పు తప్పిందని పాత పాటే పాడారు. ఈ మేరకు ట్రంప్ అమెరికా కాంగ్రెస్ లో ‘స్టేట్ ఆఫ్ యూనియన్’ ప్రసంగం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి పది నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఎనమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్నారు. పాకిస్థాన్ లో నక్కిన ఉగ్రవాదులే లక్ష్యంగా గతేడాది భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన విషయం తెల్సిందే.
ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నాటి పరిస్థితులను పేర్కొన్న ట్రంప్ తన జోక్యం లేకపోతే అణుయుద్ధం జరిగేదన్నారు. ‘నేను లేకపోతే పాకిస్థాన్ ప్రధాని చనిపోయేవారని 35 మిలియన్ల పాకిస్తానీలు చెప్పారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తన జోక్యం లేకపోతే 35 మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని పాకిస్థాన్ ప్రధాని చెప్పారని వ్యాఖ్యానించే క్రమంలో ట్రంప్ ఇలా గందరగోళ కామెంట్స్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.










