Puri Jagannath Temple | పూరి జగన్నాథ ఆలయం.. ఒడిశాలోని శ్రీక్షేత్రం. మన దేశంలో తప్పక చూడాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
ఈ ఆలయంలో శ్రీకృష్ణుడిని జగన్నాథుడు అని పిలుస్తారు. ఆలయంలో శ్రీకృష్ణుడితోపాటు బలరాముడు, సుభద్ర కొలువై ఉంటారు.
చార్ ధామ్ యాత్రలో భాగమైన పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ పూరి జగన్నాథ యాత్రకు లక్షల సంఖ్యలో జనం హాజరవుతారు. ఈ ఏడాది జూన్ 20న పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతోంది.
పూరీలో జగన్నాథ రథయాత్రతోపాటు ఈ ఆలయ విశిష్టత చాలా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి.
ఆ మిస్టరీలను ఇప్పటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆలయానికి సంబంధించి కొన్ని విశిష్టతలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
ఆలయ నిర్మాణం..
పూరిలో ముఖ్యంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. ఈ భారీ ఆలయ భవనం సుమారు 4 లక్షల చ.మీ. వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది.
పూరీ ఆలయ సముదాయంలో కనీసం 120 గుళ్లు, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.
వ్యతిరేక దిశలో ఎగిరే జెండా
పూరి ఆలయం (Puri Jagannath Temple) మిస్టరీల్లో ఒకటి గోపురం పైన ఉండే జెండా. సాధారణంగా ఏ ఆలయంలో అయినా పైన కట్టిన జెండా గాలి వీచే దిశకు అనుగుణంగా ఊగుతుంది. కానీ.. పూరిలో మాత్రం ఆలయ గోపురంపై ఉండే జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది.
దీనికి గల కారణాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. అంతేకాదు 20 అడుగుల వెడల్పు ఉండే ఈ త్రిభుజాకార జెండాను ప్రతిరోజు శిక్షణ పొందిన పూజారులు ఆలయ నిర్మాణం పైకి మారుస్తారు. గత 1800 ఏళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారట. ఈ ఆచారం ఒక్క రోజు తప్పినా.. 18 సంవత్సరాల పాటు ఆలయం మూసి వేయాల్సి ఉంటుదని చెబుతారు.
సుదర్శన చక్రం
పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. సుమారు 2000 ఏళ్ల కిందట ఈ చక్రాన్ని గోపురంపైన అమర్చినట్టు చెబుతారు. ఆ సమయంలో చక్రం తయారీలో ఉపయోగించిన డిజైనింగ్ విధానాలు నేటికీ ఒక పజిల్‌గా మిగిలిపోయాయి.
ఈ చక్రం 20 అడుగుల ఎత్తు, సుమారు ఒక టన్ను బరువు ఉంటుందట. ఈ చక్రాన్ని ఆలయ గోపురంపైకి ఎలా తీసుకెళ్ళారు మరియు ఎలా అమర్చారు అనేది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. అంతేకాదు పూరీలో ఏ ప్రదేశం నుంచి ఆ సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.
గోపురం నీడ
జగన్నాథ ఆలయంలో మరో రహస్యం ప్రధాన ద్వారం గోపురం నీడ. ఆలయంలో గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది ఇంజనీరింగ్ ప్రతిభా.. లేదా ఆ జగన్నాథుడి మహిమా అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.
పక్షులు, విమానాలు ఎగరవు..
పూరి జగన్నాథ ఆలయం (Puri Jagannath Temple) పైన పక్షులు ఎగరవు. విమానాలు వెళ్లవు. దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.
ప్రసాదం
పూరీ ఆలయంలో జగన్నాథుడి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. జగన్నాథునికి మహాప్రసాదాన్ని 5 దశల్లో వడ్డిస్తారు. ప్రసాదంలో 56 రకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి.
మహాప్రసాదాన్ని వేలాది మంది పూజారులు 750 కంటే ఎక్కువ మట్టి పొయ్యిలలో తయారు చేస్తారు! 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి కట్టెల మీద ఆహారాన్ని వండుతారు. మరో విశేషం ఏంటంటే ఆ ఏడు కుండల్లో పైభాగంలోని ఉన్న కుండలోని ఆహారం మొదట ఉడుకుతుంది.
మహాప్రసాదం ఎప్పుడూ వృథా పోదు
జగన్నాథుడి ఆలయానికి ప్రతి రోజూ 5 వేల నుంచి 20 వేల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రతిరోజూ ఒకే పరిమాణంలో ప్రసాదం (Puri MahaPrasad) తయారు చేస్తున్నారు. కానీ ఏ రోజూ ప్రసాదం వృథా అవదు.
మరో విచిత్రం ఏంటంటే ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. ఆ ప్రసాదాన్ని జగన్నాథునికి నివేదించిన తరువా ఆ ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట.
రథయాత్ర..
పూరీ జగన్నాథుడి రథయాత్ర (Puri Jagannath Rath Yatra) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రథయాత్రకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఉత్సవాల ఊరేగింపులో మూల విగ్రహాలను ఊరేగించరు. ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. కానీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రం ఆలయ మూల విగ్రహాలనే ఊరేగిస్తారు.
ఏటా కొత్త రథం..
పూరి జగన్నాథ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారు చేస్తారు. ప్రధాన పూజారి, తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయతృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి.
Image Source: Puri Jagannath Temple Wikipedia
12 ఏళ్లకోసారి కొత్త విగ్రహాలు..
పూరీ ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి మూల విగ్రహాలను మారుస్తారు. ఆలయానికి చెందిన వారికి స్వయంగా జగన్నాథుడు కలలోకి వచ్చి ఏ ప్రాంతం నుంచి రథానికి కావాలసిన కలపను సేకరించాలో వివరిస్తాడట. అక్కడి నుంచి కలపను సేకరించి దేవతామూర్తుల విగ్రహాలు తయారు చేస్తారట.
Image Source: Puri Jagannath Temple Wikipedia