TGSRTC MD Sajjanar News | ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు.
పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ సజ్జనర్ సోమవారం పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రూట్ నంబర్ 300 ఆర్డినరీ బస్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందిన విషయం తెల్సిందే.
అయితే రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడిందని, ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా డ్రైవర్ విద్యా సాగర్ పై కొందరు విచక్షణరహితంగా దాడి చేశారని సజ్జనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.
తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.









