Integrated Bhu Bharathi | తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా రైతాంగాన్ని వేధిస్తున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ రూపొందించిన ‘సమీకృత భూభారతి’ (Integrated Bhu-Bharathi) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న మంత్రి, బుధవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
మీ స్మార్ట్‌ఫోనే మీ రెవెన్యూ ఆఫీస్!
గతంలో భూమి కొలతలు, సర్వే లేదా హద్దుల కోసం రైతులు మీ-సేవా కేంద్రాల చుట్టూ, సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కొత్త పోర్టల్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా భూ సేవలు పొందవచ్చు.
రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమి వివరాలు కనిపిస్తాయి. సర్వే కావాల్సిన వారు నిర్ణీత ఫీజు చెల్లిస్తే, ఆ సమాచారం నేరుగా లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు చేరుతుంది. పాతకాలపు గొలుసులు, టేపులకు స్వస్తి పలికి, అత్యాధునిక ‘రోవర్ల’ తో సర్వే నిర్వహించి, కచ్చితమైన మ్యాప్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
తొలి దశలో ఐదు మండలాలు ఇవే..
ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల్లోని ఐదు కీలక మండలాల్లో ప్రారంభించనున్నారు.
కుసుమంచి (ఖమ్మం జిల్లా)
అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం)
అమన్ గల్ (రంగారెడ్డి)
వట్‌పల్లి (సంగారెడ్డి)
కొస్గి (నారాయణపేట)
భూధార్ – ప్రతి సర్వే నెంబర్‌కూ ఒక యూనిక్ ఐడీ..
మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్లే, ఇకపై ప్రతి సర్వే నెంబర్‌కు ఒక ‘భూధార్’ నెంబర్‌ను, ప్రతి సర్వే మ్యాప్‌కు ఒక యూనిక్ LPM (Land Parcel Map) నెంబర్‌ను కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేయనున్నారు.
దరఖాస్తు చేసుకున్న సమయం నుండి ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ రైతుకు మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. ఇది రెవెన్యూ వ్యవస్థలో అత్యంత పారదర్శకమైన మరియు విప్లవాత్మకమైన మార్పు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.






