Telangana High Court lifts stay on local body elections but prohibits 42% BC reservation | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై తాజగా రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.
ఈ క్రమంలో స్థానిక ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను పాత విధానంలో అంటే పాత రిజర్వేషన్ విధానంలో నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి న్యాయస్థానం ఆర్డర్ కాపీని కోర్టు విడుదల చేసింది.
50 శాతం రిజర్వేషన్ల పరిమితి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను రాష్ట్ర హై కోర్టు ప్రస్తావించింది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి మించకుండా స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముందుకు వెళ్లవచ్చునని స్పష్టం చేసింది. ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత విధానంలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, ఓబీసీలకు 25 శాతం రిజర్వేషన్లు 50 శాతం పరిమితి లోబడే ఉన్నాయని ఈ మేరకు వికాస్ కిషన్ రావు గవాలి కేసును హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం ఓబీసీలకు అధనంగా కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీలో ప్రకటిస్తూ రీ నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.









