Tea-time stunt on busy road lands Bengaluru man in trouble | రీల్స్ మోజులో కొందరు హద్దు మీరుతున్నారు. లైకులు, షేర్లు అధికంగా రావాలనే ఆశతో విపరీత విన్యాసాలు చేస్తున్నారు. వీరు చేసే విన్యాసాలు మూలంగా ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల రీల్స్ కోసం రోడ్లపై వీడియోలు చిత్రీకరించడం ఎక్కువగా అయ్యింది. ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి తగిన బుద్ధి చెప్పారు. బెంగళూరులోని మగడి రోడ్డులో ఓ వ్యక్తి రీల్ కోసం నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.
పక్కన వాహనాలు వెళ్తున్నాయి, వారికి ఇబ్బంది అవుతుందని ఏ మాత్రం సోయి లేకుండా కూర్చులో స్టైల్ గా కూర్చుని టీ తాగుతూ వీడియో కోసం పోజులిచ్చాడు. అనంతరం సదరు వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఈ క్రమంలో రీల్ పోలీసుల కంట పడింది.
వెంటనే రీల్స్ మోజులో పిచ్చిగా ప్రవర్తించిన వ్యక్తిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఇలాంటి విన్యాసాలు చేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.